: పార్లమెంట్‌నే నమ్మలేని పరిస్థితి వచ్చింది.. ఇక ఎవరిని నమ్మాలి?: ఢిల్లీలో ‘హోదా’పై జగన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈరోజు పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆవశ్యకతను రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు. తాము ఈరోజు రాష్ట్రపతి వద్దకు పుష్కరాలకు ఆహ్వానించడానికి రాలేదని, కేవలం హోదా కోసమే వచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పుష్కరాలకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించడానికే కేంద్రానికి వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హోదా కోసం రాని వారు వేరే పనిమీద మాత్రం అక్కడకు వచ్చి వెళుతున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ లాంటి నగరం ఏపీకి దూరమవుతోందని చెప్పి, ఏపీకి హోదా ఇస్తామని మాట ఇచ్చారని జగన్ అన్నారు. ఆ రోజు హామీలు గుప్పించిన నేతలు ఇప్పుడు మాట్లాడే తీరుని చూస్తుంటే రాష్ట్రం అన్యాయమయిపోతోందని అర్థమవుతుందని అన్నారు. పార్లమెంట్‌నే నమ్మలేని పరిస్థితి వచ్చింది.. ఇక ఎవరిని నమ్మాలి? అని ఆయన ప్రశ్నించారు. ఓ పౌరుడిగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ‘జీఎస్టీ బిల్లు వల్ల దేశానికి మేలు జరుగుతుందంటున్నారు. కానీ ఏపీకి దానివల్ల అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించాలి. ఐదేళ్ల పాటు మీరు సేల్స్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు అంటూ రాష్ట్రానికి బెనిఫిట్ ఇచ్చేవారు. వాటి ప్రయోజనాల దృష్ట్యా వేరే రాష్ట్రంలోని వారు, విదేశీయులు మనరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ ట్యాక్స్ కేంద్రం కిందికి వెళ్లిపోయింది. ఇక రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడం కష్టతరమవుతుంది’ అని జగన్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ నుంచి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మినహాయింపు ఉంటుందని అన్నారు. ‘హోదా కోసం చంద్రబాబు నుంచి స్పందన లేదు. అది మన కర్మ. మన హక్కులను ప్రభుత్వం డిమాండ్ చేయని పరిస్థితి. కేంద్రం ముందు అడిగే ధైర్యం చంద్రబాబుకి లేకుండా పోయింది. ఓ వైపు వెంకయ్య నాయుడితో కలిసి సభలు పంచుకుంటారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ వాపోతారు. మనకు రావాల్సిన హక్కులపై ప్రశ్నించే స్థితిలో చంద్రబాబు లేరు. టీడీపీ ఓ డ్రామా కంపెనీ.. వారికి నైతిక విలువలు లేవు’ అని జగన్ వ్యాఖ్యానించారు.