: నయీమ్ బెదిరింపులతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు!... ఆ వెంటనే గ్రేహౌండ్స్ రంగంలోకి!
గ్యాంగ్ స్టర్ నయీమ్ తన చావును తానే కొని తెచ్చుకున్నాడన్న వాదన కొత్తగా వెలుగులోకి వచ్చింది. పాలమూరు జిల్లా షాద్ నగర్ లో నేటి ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ హతం కాగా... అతడి కోసం గ్రేహౌండ్స్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కు దారి తీసిన పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... భూదందాలు, సెటిల్ మెంట్లలో ఆరితేరిన నయీమ్ తాజాగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగాడు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని బెదిరించిన నయీమ్ తన అనుమతి లేనిదే నియోజకవర్గంలో కాలు మోపరాదని ఆంక్షలు విధించాడు. ఈ తరహా వేధింపులే మరింత మంది ఎమ్మెల్యేలకు ఎదురు కాగా వారంతా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నయీమ్ నుంచి తన ఎమ్మెల్యేలను రక్షించుకునే క్రమంలో కేసీఆర్ వారికి బుల్లెట్ ప్రూఫ్ కార్లను కూడా అందజేశారు. అయితే ఇలా ఎంతకాలం బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తామన్న ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించిన కేసీఆర్... నయీమ్ వేట కోసం గ్రైహౌండ్ బలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే అతడి కార్యకలాపాలపై కాస్తంత గుర్రుగా ఉన్న గ్రేహౌండ్స్ బలగాలు... కేసీఆర్ నుంచి ఆదేశాలు రాగానే వెనువెంటనే రంగంలోకి దిగిపోయాయి. నయీమ్ తలదాచుకున్న షాద్ నగర్ లోని ఇంటిని చుట్టుముట్టి అతడిని హతం చేశాయి.