: రౌడీ షీటర్ నుంచి పోలీసుల కోవర్ట్... ఆపై గ్యాంగ్ స్టర్... పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన నయీమ్ నేర చరిత్ర


నల్గొండ జిల్లా భువనగిరిలో ప్రారంభమైన ఓ నేర చరిత్రకు నేటితో తెరపడింది. కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా ఎన్నో హత్యలకు పాల్పడిన నయీమ్ ఈ ఉదయం పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. పాతబస్తీలోని యాకత్ పురాలో 18 ఏళ్ల వయసులో కారు మెకానిక్ గా పనిచేస్తున్న వయసులోనే నేరాల దారిని ఎంచుకున్నాడు. చిన్న చిన్న దొంగతనాలతో కెరీర్ ను ప్రారంభించి, ఆపై హత్యలు చేసే స్థాయికి చేరాడు. 1989లో పీపుల్స్ వార్ లో చేరి, నక్సలైట్ గా కొత్త జీవితం ప్రారంభించి, పోలీసుల కోవర్టుగా మారి అనేకమంది నక్సల్స్ నాయకులను స్వయంగా హతమార్చడమే కాకుండా, వారి రహస్యాలను పోలీసులకు చేరవేశాడు. ఆపై పోలీసులతో చెడింది. అప్పటి నుంచి గ్యాంగ్ ఏర్పాటు చేసి సభ్యులను పెంచుకుంటూ పోయాడు. నయీమ్ పై 132 పోలీసు కేసులుండగా, చానాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు పట్టుబడితే, వారి నుంచి తప్పించుకోవడం నయీమ్ కు వెన్నతో పెట్టిన విద్య. 11 సార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న చరిత్ర నయీమ్ ది. అతనిపై ఉన్న కేసుల్లో పలు హత్యాభియోగాలు సైతం ఉన్నాయి. జనవరి 27, 1993లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ ను హత్య చేసి, పోలీసుల ఎదుట లొంగిపోయి, ఆపై అనారోగ్యం పేరిట ఆసుపత్రిలో చేరి కాపలా వారికి టోకరా ఇచ్చి తప్పించుకున్నాడు. తరువాత 1999 మేలో, మావోయిస్టు కార్యకర్త బెల్లి లలితను హత్య చేశాడు. అప్పటికి అతను పీపుల్స్ వార్ సభ్యుడిగానే ఉన్నాడు. ఆపై నక్సల్స్ నేతలతో వచ్చిన విభేదాలతో పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చాడు. పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తమ్ హత్యకేసులోనూ ప్రధాన ముద్దాయి. మాజీ మావోయిస్టు నేత సాంబశివరావు హత్య కేసులో ప్రధాన సూత్రధారి. పక్కా ప్రణాళికతో పటోళ్ల గోవర్థన్ రెడ్డిని హత్య చేశాడు. పలు భూ దందాలు, సెటిల్ మెంట్లకు పాల్పడి సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేసి కోట్ల రూపాయలను వెనకేసుకున్నాడు. ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండకుండా, దేశంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ తన గుట్టును పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగే నయీమ్ షాద్ నగర్ కు ఎందుకు వచ్చాడా? అన్న విషయమై పోలీసులు ఇప్పుడు కూపీ లాగుతున్నారు.

  • Loading...

More Telugu News