: మునికోటి ఆత్మబలిదానానికి ఏడాది... మాట నెరవేర్చుకోని చంద్రబాబు సర్కారు
మునికోటి... సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రానికి ప్రత్యక హోదాను ఇవ్వాలని నినదిస్తూ, ఆత్మ బలిదానం చేసుకున్న యువకుడు. వందలాది మంది చూస్తుండగా, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న మునికోటి వార్తను దేశంలోని అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రకటించి, ప్రజల్లో హోదా సెంటిమెంట్ ఎలా ఉందో తెలియజేశాయి. మునికోటి కుటుంబాన్ని ఆదుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు కూడా. ఆయన మృతదేహాన్ని పలువురు మంత్రులు సందర్శించి, నివాళులు అర్పించారు. ఇదంతా జరిగి ఏడాది గడిచింది. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు, ఇచ్చిన మాటను మరచింది. కాంగ్రెస్ పార్టీ సైతం రూ. 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. వీరెవరూ తిరిగి మునికోటి కుటుంబం వైపు మరోసారి చూడలేదు. హోదా కోసం ఎంతో తాపత్రయపడి ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడి ఆశయం నెరవేరలేదని, ఇస్తామన్న పరిహారం ఇవ్వకపోవడంతో తమ కుటుంబం కష్టాల్లో ఉందని మునికోటి సోదరుడు మురళి వాపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం కదిలొచ్చి తన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాడు.