: తమిళనాట చంద్రబాబుకు నిరసన సెగ!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు తమిళనాట నిరసన సెగలు ఎదురయ్యాయి. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన తమిళ పోలీసులు సదరు నిరసనలు మరింత తీవ్రం కాకముందే ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకెళితే... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడి వివాహ వేడుకలకు హాజరయ్యే నిమిత్తం చంద్రబాబు శనివారం రాత్రి తమిళనాడుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కోయంబత్తూరులోని ఓ హోటల్ లో బస చేశారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతం కుప్పం నియోజకవర్గంలో ఏపీ సర్కారు నిర్మిస్తున్న పాలారు ప్రాజెక్టుపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎత్తు పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే తమిళనాడు సీఎం జయలలిత ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఇటీవల 32 మంది తమిళులను రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద ఎర్రచందనం స్మగ్లర్ల పేరిట ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విడుదల చేయాలని జయతో పాటు డీఎంకే చీఫ్ కరుణానిధి కూడా చంద్రబాబుకు లేఖలు రాశారు. ఈ రెండు విషయాలపై చంద్రబాబు ముందు నిరసన తెలిపేందుకు నిన్న రంగంలోకి దిగిన తమిళ పార్టీ... సామాజిన న్యాయ పార్టీ (ఎస్ జేపీ) కార్యకర్తలు చంద్రబాబు బస చేసిన హోటల్ ముందు ఆందోళనకు దిగారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోటల్ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అయితే చంద్రబాబుకు నిరసన సెగలు తగులుతాయన్న ముందస్తు సమాచారంతో అప్పటికే అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేసిన తమిళ పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.