: ఒకే వేదికపై నారా లోకేశ్, మంచు లక్ష్మీప్రసన్న!... ఇద్దరు ‘ట్రస్టు’ విద్యార్థుల బాధ్యతలు తనవేనని 'మంచు'వారమ్మాయి ప్రకటన!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరైన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మీప్రసన్న తళుక్కుమన్నారు. నిన్న హైదరాబాదులోని ఐటీసీ కాకతీయ హోటల్ లో ప్రముఖ చిత్రకారుడు హరి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంచు లక్ష్మీప్రసన్న... టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్టు సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తున్న మోడల్ స్కూళ్ల ద్వారా ఎంతో మంది అనాథలకు ఉత్తమ విద్యాబోధన అందుతోందన్నారు. ఇది శుభపరిణామమని ఆమె పేర్కొన్నారు. ట్రస్టు సేవలకు మద్దతుగా తన వంతు సహకారాన్ని అందిస్తానని ప్రకటించిన లక్ష్మీ ప్రసన్న... ట్రస్టు మోడల్ స్కూళ్లలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు మెంటార్ గా వ్యవహరిస్తానని చెప్పారు.