: 2013లో ఇదే స్టేడియం నుంచి ప్రచారం ప్రారంభించి విజయ ఢంకా మోగించాం: వెంకయ్య
హైదరాబాద్ నుంచి అమెరికా వరకు ప్రజలంతా మోదీ జపం చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోన్న మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపే చూస్తోందని అన్నారు. అసోం నుంచి అండమాన్ వరకు బీజేపీ జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. ఏ పార్టీకీ లేనంతగా 11 కోట్ల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధే మోదీ ధ్యేయమని చెప్పారు. యూపీఏ హయాంలో అభివృద్ధి ఒక్క అడుగు ముందుకు పడితే, మూడు అడుగులు వెనక్కి పడేదని వెంకయ్య అన్నారు. అంతరిక్షం నుంచి పాతాళం వరకు అంతా అవినీతే జరిగిందని అన్నారు. ఎన్డీఏ పాలనలో అవినీతికి ఆస్కారమే లేదని పేర్కొన్నారు. 2013లో ఇదే స్టేడియం నుంచి ప్రచారం ప్రారంభించి విజయ ఢంకా మోగించామని అన్నారు. ప్రతికార్యకర్త ప్రతిగడపకు వెళ్లి కేంద్రం ప్రభుత్వ పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు.