: మళ్లీ అదే తీరు... ఆలస్యంగా ముంబై చేరిన హైస్పీడు రైలు టాల్గో
స్పానిష్ తయారీ హైస్పీడు రైలు మరోమారు ఆలస్యమైంది. ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం 2.47 గంటలకు బయలుదేరిన ఈ రైలు 17 నిమిషాలు ఆలస్యంగా శనివారం తెల్లవారుజామున 3.40 గంటలకు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన టాల్గో నిజానికి తన గమ్యాన్ని 12.36 గంటల్లో చేరుకోవాల్సి ఉండగా 12.53 గంటలు పట్టింది. అయితే భారీ వర్షాల కారణంగా సిగ్నళ్లలో సమస్యలు తలెత్తడం వల్లే రైలు కొన్ని నిమిషాలు ఆలస్యమైనట్టు సీనియర్ రైల్వే మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ-ముంబై మధ్య నిర్వహించిన తొలి ట్రయల్ రన్‌లోనూ రైలు ఆలస్యంగా నడిచిన సంగతి తెలిసిందే. 9 కోచ్‌లతో నడిచే టాల్గోకు ఢిల్లీ-ముంబై మధ్య మరికొన్ని ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ఆగస్టు 9, 14వ తేదీల్లో 140 కిలోమీటర్ల వేగంతో ఈ రైలుకు ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 1,384 కిలోమీటర్ల దూరాన్ని సూపర్ ఫాస్ట్ రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్ 16 గంటల్లో చేరుకుంటోంది. టాల్గో రైలు ద్వారా దీన్ని 12 గంటలకు తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు.