: మన్మోహన్ జీ... ఆ 5 రోజులేం చేశారు?!: మాజీ ప్రధానికి సుజనా సూటి ప్రశ్న!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో పెద్ద ఎత్తున జరిగిన చర్చలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోరు విప్పిన సంగతి తెలిసిందే. తాము సభ సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ సర్కారు అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మన్మోహన్ వ్యాఖ్యలపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మన్మోహన్ వ్యాఖ్యలను సుజనా ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014 మార్చి 1న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని మన్మోహన్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే మార్చి 5న ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దానికి చట్టబద్ధత కల్పించలేెకపోయామని మాజీ ప్రదాని చెప్పారన్నారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి మధ్య ఐదు రోజుల సమయముందని చెప్పిన సుజనా... ఆ ఐదు రోజులు ఏం చేశారని మన్మోహన్ ను ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనడానికి ఈ మాత్రం నిదర్శనం చాలదా? అని కూడా సుజనా వ్యాఖ్యానించారు.