: అక్షయ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాన్ని తెలుపుతూ నవ్వులు పూయించిన ఇలియానా
విలక్షణ పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్‌లో దూసుకుపోతున్న హీరో అక్షయ్ కుమార్. అయితే, నయా ట్రెండ్‌ను, ఫ్యాషన్‌ను ఫాలో అయ్యే ఆయన ప్యాంటు వేసుకోవడంలో తడబడ్డాడు. అయితే ఇది జరిగింది సినిమాలో లెండి! దర్శకుడు టినూ సురేశ్ దేశాయ్ తెరకెక్కిస్తున్న 'రుస్తుం' మూవీలో భాగంగా అక్షయ్ ప్యాంటు ధరించాల్సిన సమయంలో దాన్ని సరిచేసుకోవడంలో తడబడ్డాడని ఆయన గురించి ఆసక్తికర విషయాన్ని ఆయన సహనటి ఇలియానా మీడియాకు సరదాగా చెప్పింది. రుస్తుం సినిమాను 1959లో కె.ఎమ్. నానావతి అనే ఓ నేవీ ఆఫీసర్ జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో నటులు ఆ కాలం నాటి దుస్తులే ధరించాల్సి ఉంటుంది. నడుముపై వరకు ప్యాంటు ధరించాల్సి ఉంటుంది. దర్శకుడు సినిమా సీన్లను తీసేముందు ‘అందరూ మీ ప్యాంట్లు కాస్త పైకి పెట్టుకోండి’ అని సూచించేవాడట. అయితే ప్యాంటును పైకి జరుపుకోవడంలో అక్షయ్ తడబడేవాడని ఇలియానా చెబుతూ నవ్వులు పూయించింది. వచ్చే శుక్రవారం రుస్తుం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.