: ఎవరైనా డబ్బులు అడిగితే తిరగబడండి: ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
'మీ పనులు చేయించుకోవడానికి ప్రభుత్వాధికారులు ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై తిరగబడండి.. మీ వెనక నేను ఉంటాను' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతపురంలోని ధర్మవరంలో రైల్వే బిడ్జిని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం రావాలని సమాజ పరిస్థితులను అర్థం చేసుకొని వారు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. కృష్ణా పుష్కరాలు ఒక కులానికో, మతానికో, ఏ ప్రాంతానికో సంబంధించినవి కాదని ఆయన పేర్కొన్నారు. పుష్కరాలకు ఎంతో మంది వస్తారని ఆయన అన్నారు. పుష్కరాల సందర్భంగా చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మంచి సంకల్పంతో కొన్ని రోజుల క్రితం నవనిర్మాణ దీక్ష చేపట్టామని, దాన్ని పట్టుదలగా కొనసాగిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. మొక్కలు పెంచే కార్యక్రమాన్ని కూడా ఓ ఉద్యమంలా కొనసాగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి మొక్కలను పెంచే బాధ్యత చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టిందని.. కాని అది విఫలమైందని ఆయన అన్నారు. ఇప్పుడలా జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలంటే ఒక మొక్క నాటి ఉండాలని, లేదంటే వారికి పోటీ చేసే అర్హత ఇవ్వకుండా చేసే యోచనలో ఉన్నామని చంద్రబాబు అన్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు రావాలంటే, విద్యార్థులకు మార్కులు రావాలంటే కూడా మొక్కలు నాటాల్సిందేనని ఆయన నవ్వుతూ చెప్పారు. 2022కి దేశంలోని మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల జాబితాలో మనం ఉంటామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరికీ కనీస అవసరాలు కల్పించేలా, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.