: ఎంపీ శశికళను వదలని అన్నాడీఎంకే!... రూ.20 లక్షలు తీసుకుని మోసగించారంటూ పోలీసులకు ఫిర్యాదు!


పట్ట పగలు, జనమంతా చూస్తుండగా... విపక్షానికి చెందిన కీలక నేత, సాటి ఎంపీ చెంప చెళ్లుమనిపించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడ్డారు. తాను చేసిన పనికి క్షమాపణ చెప్పినా... పార్టీ అధినేత్రి జయలలిత తనపై చేయి చేసుకున్నారంటూ సాక్షాత్తు రాజ్యసభలో కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను అన్నాడీఎంకే అంత ఈజీగా వదిలిపెట్టేలా లేదు. అన్నాడీఎంకేకు చెందిన ఓ చోటా నేత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తమిళనాడు పోలీసులు శశికళపై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర విచారణను పోలీసులు ఇప్పటికే ప్రారంభించేశారు. వివరాల్లోకెళితే... తమిళనాడులోని తిరునల్వేలి పరిధిలోని పాళయంకోట శాంతినగర్ కు చెందిన అన్నాడీఎంకే నేత రాజేశ్... జాతీయ రహదారికి ఇరువైపులా చెట్లకు నీరు పోసే కాంట్రాక్టును దక్కించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ ఎంపీగా ఉన్న శశికళ సిఫారసు కోసం యత్నించారు. అయితే రూ.25 లక్షలిస్తేనే ఆ కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ చెప్పిన శశికళ... బేరసారాల తర్వాత రూ.20 లక్షలకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో రాజేశ్ రెండు విడతలుగా రూ.20 లక్షలను శశికళ చేతిలో పెట్టారట. డబ్బు మొత్తం తీసుకున్న శశికళ... కాంట్రాక్టును మాత్రం ఆయనకు ఇప్పించలేదు. దీంతో తన వద్ద డబ్బు తీసుకుని శశికళ తనను మోసగించారని రాజేశ్... ఏకంగా తిరునల్వేలి పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News