: చైనా ద్వంద్వ నీతి.. అప్పుడు భారత్‌ను అడ్డుకుని ఇప్పుడు సాయం కోసం వేడుకోలు
భారత్‌కు ఎన్‌ఎస్‌జీ (అణు సరఫరాదారుల బృందం)లో సభ్యత్వం రాకుండా గట్టిగా అడ్డుకున్న చైనా ఇప్పుడు అదే దేశ సాయం కోసం వేడుకుంటోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం విషయంలో తమకు అండగా నిలవాలని కోరేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ రానున్నారు. ఈనెల 12 నుంచి ఆయన మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్న చైనా కుయుక్తులను అంతర్జాతీయ న్యాయస్థానం అడ్డుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా కూడా ఈ విషయంలో గుర్రుగా ఉంది. వివాదాస్పద ఈ అంశాన్ని సెప్టెంబరులో జరగనున్న జి-20 సమావేశాల్లో ప్రస్తావించాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. దీంతో చైనా వెన్నులో వణుకు మొదలైంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో తమకు సహకరించాలని, ఇతర దేశాలతో కలవకుండా ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని అభ్యర్థించనుంది. ఇందులో భాగంగానే వాంగ్ యి భారత్ పర్యటనకు రానున్నట్టు తెలుస్తోంది.