: యూఎస్‌లోని 30 లక్షలమంది భారతీయుల్లో ఒకే ఒక్కడు.. ఎన్నికల బరిలో రాజా కృష్ణమూర్తి
అమెరికాలో నివసిస్తున్న 30 లక్షల మంది భారతీయుల తరపున ఇండియన్-అమెరికన్ రాజా కృష్ణమూర్తి(42) ఎన్నికల బరిలోకి దిగారు. ప్రస్తుతం అక్కడ నువ్వా? నేనా? అన్నట్టు సాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోరులో డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీలోకి దిగిన కృష్ణమూర్తికి మద్దతుగా స్థానిక ఎన్నారైలు ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. టెక్సాస్‌లోని కాలీవిల్‌లోని తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ నివాసంలో మూడో తేదీన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు వందమందికిపైగా డెమోక్రాట్ల మద్దతు రాజాకు ఉందన్నారు. సాధారణ ప్రజల కష్టసుఖాలు తెలిసిన కృష్ణమూర్తి ఎన్నికైతే అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. ఆయన తప్పకుండా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.