: ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం వుంది: చంద్రబాబు
విభజన సమయంలో ఇచ్చిన ప్రతిఒక్క హామీని అమలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్య బిల్లా? కాదా? అనే అంశాన్ని తేల్చాలంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ లోక్‌సభ స్పీకర్‌కు నివేదించారని ఆయన అన్నారు. అయితే ద్రవ్య బిల్లు ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలోనే హోదాపై ప్రకటన చేయాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. బిల్లుకి మద్దతిచ్చిన 11 పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 2018-19 నాటికి పూర్తి కావాలని, ఆ ప్రాజెక్టుకి తాము కేంద్రాన్ని నిధులు కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాసనసభ సీట్లను పెంచాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలని చూస్తున్నామని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు అంశాలని నాటి ప్రభుత్వం చట్టంలో పెట్టిందని, ఏపీకి హోదా వస్తుందన్న నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదాను సాధించాలన్న చిత్తశుద్ధి లేదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న పలు పరిస్థితుల దృష్ట్యా ఏపీకి రావాల్సిన పలు పెట్టుబడులు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని అన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా పదేళ్లు కోరితే ఆరోజు ఐదేళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తు చేశారు.