: ఆకతాయిల వికారపు చేష్టలతో విద్యకు దూరమవుతున్న ఉత్తరప్రదేశ్ బాలికలు
ఉత్తరప్రదేశ్‌లో ఎంతో మంది విద్యార్థినులు చదువుకి దూరమయిపోతోన్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో 45 మంది బాలికలు ఇప్పటికే వారి చదువును మధ్యలోనే మానేశారు. దీనికంతటికీ కారణం ఆకతాయిల చేష్టలే. బాలికలు ఒక్కసారిగా చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టిన అంశం అక్కడి పోలీసు శాఖను కదిలించింది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తోన్న బాలికలు వారి చదువును కొనసాగించాలంటే ప్రతిరోజు అష్టకష్టాలు పడి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. దానికి తోడు దారిలో ఆకతాయిలు చేసే చేష్టలు, లైంగిక వేధింపులు, జరుగుతోన్న అత్యాచారాలతో విద్యార్థినులు భయం గుప్పిట విద్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో మారుమూల గ్రామమైన బరేలీ జిల్లాలో ఏకంగా 45 మంది బాలికలు తమ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యాలయాలకు దూరమయ్యారు. ఈ అంశంపై స్పందించిన పోలీసులు వేధింపులపై బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆకతాయిలపై నిఘా పెట్టారు. ఇద్దరు ఆకతాయిలపై కేసు పెట్టారు. బాలికలపై వేధింపుల అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించకపోవడంతోనే ఆకతాయిలు రెచ్చిపోయి, బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. బాలికలకు పూర్తి రక్షణ కల్పిస్తామని, వారు తిరిగి బడికి వెళ్లాలని బరేలీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆర్కే భరద్వాజ్ మీడియాకు తెలిపారు. విద్యార్థినులు వెళ్లే మార్గంలో వారిని వేధిస్తున్నారని తమకు తెలిసిందని పేర్కొన్నారు.