: హోదా ఇవ్వడానికి చట్టం ఎందుకు?: రాజ్యసభలో నిప్పులు చెరుగుతున్న కేవీపీ
ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని బీజేపీ పదేపదే చెబుతుండటాన్ని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా తప్పుబట్టారు. అసలు హోదా ఇవ్వడానికి చట్టం ఎంతమాత్రమూ అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన, బీజేపీ తప్పించుకుని పోవాలని భావిస్తే, తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. తానిచ్చిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ప్రసంగించిన ఆయన, గొంతు సమస్య ఉన్నప్పటికీ, గట్టిగానే మాట్లాడారు. తాను పెట్టాలనుకున్న బిల్లుకు 11 పార్టీలు మద్దతిచ్చాయని, వారందరికీ కృతజ్ఞతలని అన్నారు. రాజ్యసభలో సభ్యుడిగా ప్రైవేటు బిల్లు పెట్టే హక్కు తనకుందని, దీన్ని కూడా అడ్డుకోవాలని, బిల్లు చర్చకు రాకుండా కుయుక్తులు పన్నారని ఆరోపించారు. తాను పెట్టిన ప్రత్యేక హోదా బిల్లును ద్రవ్య బిల్లుగా అరుణ్ జైట్లీ చూపడం అత్యంత దారుణమని చెబుతూ, దేనిని ద్రవ్య బిల్లుగా పరిగణించవచ్చో సూచించే రాజ్యాంగ నిబంధనలను చదివి వినిపించారు. రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తోందని నిప్పులు చెరిగారు. హోదాపై స్వయంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు, వారి భవిష్యత్తుతో ఆటలాడకుండా, వెంటనే హోదాను ప్రకటించాలని కోరారు. తన బిల్లుపై వెంటనే డివిజన్ చేబట్టాలని ఆయన డిమాండ్ చేశారు.