: ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్ ఖాళీ... ఆల్మట్టి ఇన్ ఫ్లో 1.21 లక్షలు, ఔట్ ఫ్లో 2.40 లక్షల క్యూసెక్కులు
ఆల్మట్టి డ్యామ్ కు భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటం, అది మరింతగా పెరగవచ్చన్న అధికారుల అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొంతమేరకు డ్యామ్ ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆల్మట్టికి 1.21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువ నుంచి మరింత నీరు నేటి సాయంత్రానికి వస్తుందన్న అంచనాలతో, దిగువకు 2.40 లక్షల క్యూసెక్కులను వదులుతూ, డ్యామ్ ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న వరద నీటి ప్రవాహం గరిష్ఠానికి చేరి, ఆపై నిదానంగా తగ్గుతూ కనీసం వారం రోజుల పాటు ఉంటుందని ఊహిస్తున్న అధికారులు ఇన్ ఫ్లోకు రెట్టింపు స్థాయిలో నీటిని వదులుతున్నారు. కాగా, ప్రస్తుతం నారాయణపూర్ వద్ద 2.18 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, 2.47 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఇప్పటికే శ్రీశైలానికి వస్తున్న నీరు 2 లక్షల క్యూసెక్కులను దాటగా, రేపటికి 3 నుంచి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కావచ్చని అంచనా.