: అధ్యక్షుడి పిలుపుతో రెచ్చిపోతున్న ఫిలిప్పీన్స్ ప్రజలు ...రక్తపు మడుగులుగా మారుతున్న వీధులు!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్ టీ చెప్పిన మాటలు, ఆ దేశాన్ని రక్తపు మడుగుగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో ఎక్కడ చూసినా రోడ్లపై కాళ్లూ, చేతులూ కట్టి పడేసిన వాళ్లు, అవయవాలు తెగి పడివున్న వారు, హత్య చేయబడ్డవారు కనిపిస్తున్నారు. దేశంలో డ్రగ్స్ మాఫియాను అంతం చేసే దిశగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని, ఎదురుగా డ్రగ్స్ అమ్ముతున్నట్టు చూస్తే, వారు ఎవరైనా అక్కడికక్కడ కాల్చి పారేయాలని, కేసులు లేకుండా తాను చూసుకుంటానని ఆయన చెప్పిన మాటలతో, రెచ్చిపోతున్న జనం, ఇష్టానుసారం హింసాకాండలకు దిగుతున్నారు. డ్రగ్స్ మాఫియా పేరిట అమాయకుల హత్యలు పెరిగిపోయాయి. జూన్ 30న రోడ్రిగో అధికారంలోకి రాగా, ఇప్పటివరకూ 465 మందికి పైగా హత్యకు గురయ్యారు. రెండు వేల మంది వరకూ తీవ్ర గాయాలతో చికిత్సలు పొందుతున్నారు. మరణించిన వారిలో అమాయకులు ఎందరో ఉన్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా దిగిరాని రోడ్రిగో, దేశంలో డ్రగ్స్ మాఫియాను సమూలంగా నాశనం చేసే వరకూ తాను తగ్గబోనని శపథం చేస్తున్నారు. మాఫియా పేరు వింటేనే తనకు విపరీతమైన ఆగ్రహం కలుగుతోందని, వారిలో చివరి వ్యక్తి వరకూ హతమవాల్సిందేనని ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. దీంతో ఫిలిప్పీన్స్ భయంకర పరిస్థితిలో పడింది.