: జీఎస్టీ అమలు అంత ఈజీ కాదట!... 60 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న కేంద్రం!
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రంగంలోకి దిగనున్న జీఎస్టీ బిల్లును అమలు చేయడం అంత ఈజీ విషయమేమీ కాదట. ఈ కారణంగానే ఈ పన్నును వసూలు చేసేందుకు కేంద్రం భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ కసరత్తులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన దాదాపు 60 వేల మందికి పైగా రెవెన్యూ అధికారులకు కేంద్రం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ మేరకు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హశ్ ముఖ్ ఆధియా ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్లిష్టతతో కూడిన జీఎస్టీ పన్ను అమలు కోసం ఈ ఏడాది డిసెంబర్ నాటికి సరంజామా మొత్తాన్ని సిద్ధం చేసుకునే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్పిన ఆధియా... వచ్చే ఏడాది మార్చి నాటికి ట్రయల్ రన్ ను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇక జీఎస్టీపై వర్తక, వాణిజ్య వర్గాలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడతామని ఆయన చెప్పారు.