: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు!... నేడు 11.30 గంటలకు ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ!
దేశ రాజధాని హస్తిన పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఉదయం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన చంద్రబాబు... నిన్నంతా ఢిల్లీలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలతో తీరిక లేకుండా గడిపారు. తాజాగా మరికాసేపట్లో తన విడిది నుంచి బయటకు రానున్న చంద్రబాబు... ఉదయం 9.30 గంటలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత 10.30 గంటలకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నూ ఆయన కలుస్తారు. ఆ తర్వాత 11.30 గంటలకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. కృష్ణా పుష్కరాలకు ప్రధానిని ఆహ్వానించనున్న చంద్రబాబు... ఏపీకి ప్రత్యేక హోదాపైనా మోదీతో చర్చలు జరుపుతారని ప్రచారం సాగుతోంది.