: కోదండరాం లాంటి మేధావులు అధ్యయనం చేసి మాట్లాడాలి: ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు ఎన్నో ఏళ్లుగా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రాజెక్టులపై విమర్శలు చేస్తోన్న ప్రొఫెసర్ కోదండరాం లాంటి మేధావులు ముందుగా వాటిని అధ్యయనం చేయాలని ఆ తరువాతే మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే టీజేఏసీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని ఆమె అన్నారు. జేఏసీ కంటే ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవడం మేలని ఆమె టీజేఏసీ నేతలకు సూచించారు. తనకు తెలంగాణ జాగృతి తల్లిగారి ఇల్లు లాంటిదని, టీఆర్‌ఎస్ అత్తారిల్లు లాంటిదని కవిత అన్నారు. జాగృతి నాయకురాలిగానే తనను ప్రజలు ఎంతో ఆదరిస్తారని అన్నారు. తెలంగాణ జాగృతిలో వివిధ పార్టీల నేతలున్నారని ఆమె అన్నారు. వారు దానిలో ఉండడంపై తాము అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు.