: జీఎస్టీ ఓటింగ్ వేళ నంబర్ల మ్యాజిక్... రాజ్యసభలో నవ్వులే నవ్వులు!
భారత పన్ను వ్యవస్థలో అత్యంత కీలక సంస్కరణగా వచ్చిన వస్తు సేవల బిల్లుకు రాజ్యసభ ఆమోదం పలుకుతున్న వేళ సభలో నవ్వులే నవ్వులు. ఎందుకో తెలుసా? ఈ బిల్లుపై ఓటింగ్ జరుగుతుండగా, ఫలితాన్ని డిస్ ప్లే చేసే ఎలక్ట్రానిక్ బోర్డులో ఒక్కోసారి ఒక్కో అంకె పడుతూ ఉండటమే. బిల్లును వ్యతిరేకిస్తూ, అన్నాడీఎంకే వాకౌట్ చేసిన అనంతరం తొలి చట్ట సవరణకు ఓటింగ్ ను కోరగా, 197 మంది 'ఐస్' (Ayes- అనుకూలురు) చెప్పగా, నో అని ఎవరూ చెప్పలేదని బోర్డుపై పడింది. ఆపై రెండో సవరణకు 200 మంది, మూడో సవరణకు 201 మంది 'ఐస్' చెప్పినట్టు చూపింది. క్షణక్షణానికీ సంఖ్య మారుతుండటంపై కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ తనదైన శైలిలో స్పందించారు. తలుపులు మూసి, లాబీలను క్లియర్ చేసి ఓటింగ్ చేపడుతుంటే, కొత్తగా ఎక్కడి నుంచో నలుగురు వచ్చినట్టున్నారని ఆయన వ్యాఖ్యానించగా, ఈ సంఖ్యలను సరిచేయాల్సి వుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆపై మరో సవరణపై ఓటింగ్ జరుగగా, ఈసారి 'ఐస్' అన్న వారి సంఖ్య 203కు పెరిగిపోయింది. దీంతో కురియన్ సైతం నవ్వుతూ, ఈ సంఖ్య మరింతగా పెరిగేలా ఉందని అన్నారు. మరో సవరణకు 205 మంది ఓటేసినట్టు కూడా వచ్చింది. ఏదో మ్యాజిక్ జరుగుతోందని వ్యాఖ్యానించిన కురియన్, చివరకు 203 మంది సభ్యుల మద్దతుతో బిల్లు ఆమోదం పొందిందని ప్రకటించారు.