: 61 సంవత్సరాల తరువాత విండీస్ బౌలర్ ఛేజ్ అద్భుత రికార్డు... టెస్ట్ మ్యాచ్ ని ఇండియాకు దూరం చేసింది!


304 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో నిలిచి, విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత జట్టు, వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో డ్రాకు మాత్రమే పరిమితం కావడానికి వరుణుడు ఒక కారణం కాగా, తన అద్భుత బ్యాటింగ్ ప్రతిభతో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన రోస్టన్ చేజ్ మరో కారణం. దాదాపు 61 సంవత్సరాల తరువాత రోస్టన్ ఛేజ్ అద్భుత రికార్డును సాధించి, విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ సరసన నిలిచాడు. విండీస్ టెస్టు జట్టులోని బౌలర్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్ల మార్క్ ను తాకడం 1966 తరువాత ఇదే ప్రథమం. ఆగస్టు 1966లో ఇంగ్లండ్ తో హెడింగ్లేలో జరిగిన మ్యాచ్ లో గ్యారీ సోబర్స్ 174 పరుగులు చేయడంతో పాటు 41 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుని రాణించాడు. ఇక భారత్ పై మరో జట్టులోని బౌలర్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసిన ఘటన 1982 తరువాత ఇదే తొలిసారి. అప్పట్లో ఫైసలాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఇమ్రాన్ ఖాన్ 117 పరుగులతో పాటు రెండు ఇన్నింగ్స్ లలో ఐదు వికెట్ల చొప్పున తీసి రాణించాడు. ఇక టెస్టు మ్యాచ్ లలో 5, 6, 7, 8 స్థానాల్లో వచ్చిన నలుగురు బ్యాట్స్ మన్లూ హాఫ్ సెంచరీకి పైగా పరుగులు సాధించడం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఐదోసారి మాత్రమే. ఆరు, ఏడవ వికెట్లకు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని విండీస్ జట్టు నమోదు చేయడం ఇది రెండోసారి. మొదటిసారి ఈ ఫీట్ ను భారత్ మీదే విండీస్ నమోదు చేసింది. 1983లో కాన్ఫూర్ లో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత నమోదైంది. ఈ మ్యాచ్ జరిగిన సబీనా పార్కులో 1998 తరువాత ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడం ఇదే తొలిసారి. ఇంత అద్భుత ఆటతీరును ప్రదర్శించిన విండీస్ జట్టు కచ్చితంగా డ్రాకు అర్హమైనదేనని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News