: ‘అగ్రిగోల్డ్’ పునర్వ్యవస్థీకరణ కుదరదన్న కేంద్ర ఆర్థిక శాఖ
అగ్రిగోల్డ్ గ్రూప్ ను పునర్వ్యవస్థీకరించలేమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం-1949లోని సెక్షన్ 45 ద్వారా బ్యాంకింగ్ సంస్థలను మాత్రమే విలీనం చేయగలమని, అగ్రిగోల్డ్ నాన్ బ్యాంకింగ్ వ్యవస్థ అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాసిన ఒక లేఖకు ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్ సమాధానమిచ్చారు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేసి తిరిగి చెల్లించడంలో విఫలమవడాన్ని సెబీ, ఆర్బీఐ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. ఖాతాదారులకు తిరిగి డబ్బు చెల్లించే విషయానికి సంబంధించి సదరు సంస్థ ఆస్తుల విక్రయంపై హైదరాబాద్ హైకోర్టులో తెలంగాణ అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశాయని, ప్రస్తుతం ఈ కేసును కోర్టు పరిశీలిస్తోందని అర్జున్ రామ్ మెగ్వాల్ పేర్కొన్నారు.