: కనిపించని జీఎస్టీ ప్రభావం... ప్రపంచ మార్కెట్ల పతనంతో 'బేర్'మన్న స్టాక్ మార్కెట్!
భారత పన్ను సంస్కరణల చరిత్రలో అత్యంత కీలకమైన జీఎస్టీ బిల్లు అన్ని అడ్డంకులనూ దాటుకుని ఆమోదం దిశగా కదులుతున్న వేళ మార్కెట్ వర్గాల నుంచి సానుకూల స్పందన కనిపించ లేదు. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉన్న వేళ, అదే దారిలో నడిచిన సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది. ఈ పరిస్థితి తాత్కాలికమేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రీ సెషన్ లో క్రితం ముగింపుతో పోలిస్తే లాభాల్లో ఉన్న సూచికలు, ప్రధాన ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారి పోయాయి. ఆపై ఏ దశలోనూ బెంచ్ మార్క్ సూచీలు కోలుకోలేదు. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 284.20 పాయింట్లు పడిపోయి 1.02 శాతం నష్టంతో 267,697.51 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 78.05 పాయింట్లు తగ్గి 0.91 శాతం నష్టంతో 8,544.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.50 శాతం, స్మాల్ కాప్ 1.14 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 12 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్, ఇన్ ఫ్రాటెల్, సిప్లా, అదానీ పెయింట్స్, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బీహెచ్ఈఎల్, ఐటీసీ, టాటా మోటార్స్, మారుతి సుజుకి తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,871 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 906 కంపెనీలు లాభాలను, 1,825 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,07,26,837 కోట్లకు తగ్గింది.