: జీఎస్టీ వస్తే ఇక జేబులు గుల్లే!
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్ టీ) సవరణల బిల్లు వస్తే జేబులు గుల్లవుతాయనే చర్చ అప్పుడే మొదలైంది. జీఎస్టీ సవరణల బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందడం ఇక లాంఛనమే కావడంతో ధరలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి. ‘ఒకే దేశం..ఒకే పన్ను’ అనే నినాదంతో వస్తున్న ఈ బిల్లులో పన్ను రేటును అనుసరించి ఏయే ధరలు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయో తెలుస్తుంది. ఒకవేళ జీఎస్ టీ 18 శాతంగా నిర్ణయిస్తే ఫోన్, కరెంటు బిల్లులు పెరుగుతాయి. ఎందుకంటే, ప్రస్తుతం వీటిపై పన్నులు 15 శాతం మాత్రమే ఉన్నాయి. సామాన్యుడు ఎక్కువగా వినియోగించే సేవల బిల్లులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సేవలైన ఆరోగ్యం, విద్యలకు మినహాయింపు ఉన్నట్లే జీఎస్టీలోనూ వీటికి అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు టెలికాం, బీమా రంగాలు జీఎస్టీలో తక్కువ పన్నురేటు కేటిగిరిలో ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.