: రిలీజ్ కు ముందే ‘బాహుబలి-2’పై కాసుల వర్షం!.,. తమిళ హక్కులు రూ.45 కోట్లకు విక్రయం!
భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన తెలుగు చిత్ర రాజం ‘బాహుబలి’ రెండో భాగం ‘బాహుబలి- 2’పై కూడా విడుదలకు ముందే కాసుల వర్షం కురుస్తోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాని ఈ చిత్రానికి సంబంధించిన తమిళ అనువాద హక్కులు రూ.45 కోట్లకు అమ్ముడైపోయాయి. ఈ మేరకు ఈ చిత్ర యూనిట్ కు చెందిన ఓ కీలక వ్యక్తి దేశీయ న్యూస్ ఏజెన్సీ ‘ఐఏఎన్ఎస్’కు చెప్పారు. అయితే సదరు హక్కులు కొనుగోలు చేసిన వ్యక్తి పేరును మాత్రం ఆయన బయటపెట్టలేదు. చిత్రం తమిళ హక్కులు రూ.45 కోట్లకు అమ్ముడుబోయిన మాట వాస్తవమేనని చెప్పిన ఆయన సదరు హక్కులను దక్కించుకున్న వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని చెప్పారు. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క తదితర భారీ తారాగణం నటిస్తున్నారు. టాలీవుడ్ హిట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టనుందని జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.