: ‘హోదా’పై కేంద్రానికి వారమే గడువు!... ఆపై పోరుబాటేనన్న టీడీపీ ఎంపీలు!
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని టీడీపీ ఎంపీలు తేల్చిచెప్పారు. ఇందుకోసం కేంద్రానికి వారం రోజులు మాత్రమే గడువు విధిస్తున్నామని చెప్పిన ఎంపీలు ఆ తర్వాత పోరుబాట పడతామంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నేటి పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు పట్టి ‘హోదా’ నినాదాలు చేసిన టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాగంటి మురళీమోహన్ లు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేంద్రానికి డేంజర్ బెల్స్ మోగించారు. ఏపీకి ఏదో చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడంతో ఆయన మాట మీద గౌరవముంచి ఆందోళనలను తాత్కాలికంగా విరమించినట్లు తెలిపారు. జైట్లీ ప్రకటన కోసం ఓ వారం రోజుల పాటు వేచి చూస్తామని చెప్పిన వారు... అప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే కనుక పోరు బాట పడతామని ప్రకటించారు.