: గుళ్లు, గోపురాలు తిరగడం తప్ప ఆయనకు మరేం పనిలేదు... గవర్నర్ పై వీహెచ్ ఘాటు విమర్శలు
గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తనకు వస్తోన్న ఫిర్యాదులు, వినతుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ గుళ్లు, గోపురాలు తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఆయనకు అది తప్ప వేరే పనేలేదని వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పుష్కరాలకు సంబంధించిన పనుల్లో ఎంతో అశ్రద్ధ కనిపిస్తోన్నా, గవర్నర్ వాటిపై ఎందుకు స్పందించబోరని ఆయన దుయ్యబట్టారు. విజయవాడలోని భవానీ ఘాట్ వద్ద వంతెన నిర్మాణం నాసిరకంగా జరిగిందని వీహెచ్ అన్నారు. అక్కడి పిల్లర్ పడిపోయినా కూడా గవర్నర్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. పుష్కర పనులపై విచారణకు ఆదేశించాలని ఆయన అన్నారు. గవర్నర్ వద్దకు చేరుతోన్న ఫిర్యాదులు, వినతి పత్రాలన్నీ డస్ట్‌బిన్‌లోనే పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.