: ‘హోదా’ అంశంపై జైట్లీ అసత్యాలు చెబుతున్నారు: జైరాం రమేశ్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఉదయం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక సంఘం చేస్తోన్న సిఫార్సులని అరుణ్‌జైట్లీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయాలు, పంపకాలపై ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుందని, సాధారణంగానే కొన్ని రాష్ట్రాలు వాటిపై సానుకూలంగా స్పందించి, అంగీకరిస్తాయని ఆయన అన్నారు. ఏపీకి హోదా అంశాన్ని ఆర్థిక సంఘం రద్దు చేయలేదంటూ తెలుపుతూ, అందుకు సంబంధించిన ఓ మెయిల్‌ను ఆయన మీడియాకు చూపారు. 14వ ఆర్థిక సంఘం హోదా రద్దు చేస్తున్నట్లుగా సిఫార్సులు జారీ చేయలేదని, ఈ అంశాన్ని తెలుపుతూ ఆర్థిక సంఘంలోని ముఖ్య సభ్యుడు అభిజిత్ సేన్ నుంచి తనకు ఈ మెయిల్ వచ్చిందని ఆయన తెలిపారు. కేంద్ర ఆర్థిక సంఘం కేవలం సిఫార్సులు చేస్తుందని, వాటిపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. అసత్యాలు చెబుతూ అరుణ్‌జైట్లీ ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల ఆదాయాన్ని ఆర్థిక సంఘం పెంచిన అంశాన్ని గురించి ఆయన వివరిస్తూ.. ఆదాయాన్ని 32 శాతం నుంచి 42 శాతానికి మాత్రమే పెంచిందని, అన్ని రాష్ట్రాలకు అదే వర్తిస్తుందని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాలు అంటూ విడదీస్తూ ఎటువంటి సూచనలు చేయలేదని ఆయన తెలిపారు. ఏపీకి హోదా ఇచ్చే అంశం అన్నది మోదీ సర్కారు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అరుణ్‌జైట్లీ ఈ అంశంపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అంటూ అసత్యాలాడుతున్నారని ఆయన అన్నారు. దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంటే వాటిల్లో ఆరు రాష్ట్రాల్లో తమ పార్టీనే అధికారంలో ఉందని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం రాజకీయ లాభాపేక్షతోనే తీసుకుంటున్న నిర్ణయాలుగా ఆయన అభివర్ణించారు. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉందని, కేంద్రం, రాష్ట్ర అధికార పార్టీల మధ్య మిత్రత్వం నామమాత్రం కాదని ఆయన అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం విఫలమయిందని ఆయన విమర్శించారు.