: ఏంటో ఈ ట్రంప్... చంటి బిడ్డ తల్లిని సభ నుంచి వెళ్లిపొమ్మన్నారు!
తాను ప్రసంగిస్తున్న వేళ, ఓ చంటి బిడ్డ ఏడుపు లంఘించుకోవడంతో, ఆ తల్లీబిడ్డలను సభ నుంచి బయటకు వెళ్లాలని చెప్పారు అమెరికన్ అధ్యక్ష రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలకు కారణమైన ఈ ఘటన వర్జీనియాలో ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహించిన వేళ జరిగింది. తొలిసారి ఏడుపు వినిపించగానే, పిల్లలంటే తనకు ఇష్టమని ప్రేమ కురిపించిన ఆయన, ఆపై ఆమెను వెళ్లిపోవాలని కోరారు. తొలుత "నేను కూడా పిల్లలను ప్రేమిస్తాను. ఆ బిడ్డ గురించి పట్టించుకోవద్దు" అన్న ట్రంప్, ఏడుపు ఆగకపోయేసరికి, తన మనసును ఆహూతుల ముందు తెరిచేశారు. "బేబీ ఏడుపు వినిపిస్తోంది. ఐ లైక్ ఇట్. ఎంత అందంగా ఉందా పాప. వాళ్లమ్మ ఇలా ఇలా పరిగెడుతోంది. (కొంత అభినయం). ఆమె వయసులో ఉంది, అందంగా, ఆరోగ్యంగా ఉంది. (ఈలోగా ఆమె తన బిడ్డను తీసుకుని అటూ ఇటూ నడుస్తూ సముదాయించేందుకు లేచింది). మనకు కావాల్సింది కూడా ఇదే" అని అన్నారు. అప్పటికీ పాప ఏడుపును ఆపకపోవడంతో, ఆమెను బయటకు వెళ్లాలని కోరిన ట్రంప్, ఆమె వెళ్లిన తరువాత ఈ ఘటన వివాదం రేపుతుందేమోనన్న ఉద్దేశంతో జోకులేసి నవ్వించాలని చూశారు.