: మెట్రోరైలు ప్రాజెక్టు పిల్లర్ విరిగిపోయినట్లు ఉన్న ఫోటో మనది కాదు, ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: కేటీఆర్


హైదరాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ మెట్రోరైలు ప్రాజెక్టులో అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ, గచ్చిబౌలి సమీపంలో మెట్రోరైలుకి చెందిన‌ ఓ పిల్లర్ విరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉందంటూ సామాజిక మ‌ద్య‌మాల్లో వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ పిల్ల‌ర్ విరిగిపోయిన‌ట్లు ఉన్న ఓ ఫోటో ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేసింది. అయితే, ఆ ఫోటో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించింది కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ ఫోటో పీవీ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించిన ఫ్లైఓవర్ పిల్లర్‌ది కూడా కాద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో క‌నిపిస్తోన్న ఆ ఫోటో పాకిస్థాన్ రావల్పిండికి చెందినదని కేటీఆర్ తెలిపారు. రావ‌ల్పిండిలో మెట్రో స్థితిని తెలుపుతూ ఓ వార్తా సంస్థ ప్ర‌చురించిన న్యూస్‌లో ఆ ఫోటో ఉన్న అంశాన్ని గురించి తెలిపే లింకును కేటీఆర్ ఈ సంద‌ర్భంగా షేర్ చేశారు. ప్ర‌జ‌లు ఇటువంటి వదంతులు నమ్మొద్దని ఆయ‌న పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల‌ను అస్త్రంగా చేసుకొని జ‌రుగుతోన్న‌ ప్రచారాల‌ పట్ల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News