: కృష్ణా, గోదావరి పొంగుతాయట!... తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం!
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతాయట. ఫలితంగా వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందట. దీంతో 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వరద ముప్పు పొంచి ఉన్న దేశంలోని పలు రాష్ట్రాలను కూడా కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం నిన్న పలు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా లేఖలు రాసింది. ఈ లేఖలోని వివరాల్లోకెళితే... తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో మరో 4 నుంచి 7 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాల కారణంగా ఈ రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన నేపథ్యంలో నీటిని కిందకు వదిలేందుకు ఎగువ రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫలితంగా ఏపీలోని శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారే ప్రమాదం ఉంది. దీంతో మరో వారం రోజుల పాటు శ్రీశైలం జలాశయం నీటి మట్టాలపై 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. అంతేకాక విపత్తు నివారణ సంస్థలు కూడా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.