: అమెరికా ఫ్లైట్ లో విశాఖ వాసి వెకిలి చేష్టలు!... అరెస్ట్ చేసిన ఎఫ్ బీఐ!
అమెరికాలో తెలుగు నేలకు చెందిన వ్యక్తి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ముదిమి వయసుకు చేరువైన సదరు వ్యక్తి అసభ్య చేష్టలపై ఆ దేశానికి చెందిన ఓ జంట చేసిన ఫిర్యాదుతో ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కూనం వీరభద్రరావుగా పోలీసులు గుర్తించారు. గత నెల 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళుతున్న విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే... వీరభద్రరావు పక్కన అమెరికాకు చెందిన ఓ మహిళ తన సహచరుడితో కూర్చున్నారు. ప్రయాణంలో భాగంగా ఆమె నిద్రపోయింది. నిద్ర నుంచి మేల్కొన్న ఆమె... తన జననావయవాలపై వీరభద్రరావు చేయి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆయన తన కాలుతో ఆమె కాలును తడుముతున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన సహచరుడికి చెప్పారు. దీంతో బాధితురాలి సహచరుడు వీరభద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రింకు కొనిస్తాను, విషయాన్ని మరిచిపోవాలంటూ వీరభద్రరావు వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ జంట ఆయనపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెనువెంటనే స్పందించిన విమాన సిబ్బంది వీరభద్రరావు సీటును అక్కడి నుంచి మార్చేశారు. అంతేకాకుండా విమానం నుంచే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానం నెవార్క్ చేరుకోగానే అక్కడ ఎఫ్ బీఐ అధికారులు వీరభద్రరావును అరెస్ట్ చేశారు. అనంతరం మొన్న (సోమవారం) ఆయనను నెవార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో 50 వేల డాలర్లు (రూ.33 లక్షలు) సెక్యూరిటీ బాండ్ ను సమర్పించిన ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. వీరభద్రరావుపై నమోదైన అభియోగాలు రుజువైతే... ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.1.66 కోట్ల మేర జరిమానా పడే అవకాశాలున్నాయి.