: బంద్ ను విజయవంతం చేసి, ప్రజలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారు!: జగన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై చేపట్టిన బంద్ కు సహకరించిన అందరికీ ధన్యవాదాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 5 కోట్ల మంది ప్రజలు బంద్ విజయవంతం కావడంలో భాగమయ్యారని అన్నారు. నేటి బంద్ తో రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేకహోదా కావాలన్న ఆకాంక్షను బలంగా వెలిబుచ్చారని అర్థమైందని ఆయన చెప్పారు. అయితే, ఇక్కడ అర్థం కానిదేంటంటే...ప్రత్యేకహోదాపై ప్రజలంతా రోడ్డెక్కినప్పుడు అరెస్టులు ఎందుకు చేశారని నిలదీశారు. హోదాపై పోరాడుతున్నామన్నప్పుడు ప్రజలు శాంతియుతంగా బంద్ నిర్వహిస్తే...వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన అడిగారు. ప్రత్యేకహోదాపై చేసిన బంద్ లో టీడీపీ నేతలు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. బ్లాక్ బ్యాడ్జ్ లు ధరించి రోడ్లు ఊడుస్తామన్న టీడీపీ అధినేత ఏ రోడ్డు క్లీన్ చేశారని ఆయన అడిగారు. టీడీపీ నేతలు అసలు బంద్ లోనే పాల్గోలేదని ఆయన తెలిపారు. దీంతో ఏపీకి ప్రత్యేకహోదాపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది తెలిసిపోయిందని ఆయన అన్నారు. బంద్ ను విజయవంతం చేసిన ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.