: కలిసికట్టుగా, విడివిడిగా!... పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ, వైసీపీల ధర్నా!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో నేడు కూడా నిరసనల హోరు వినిపిస్తోంది. నిన్న ఇదే డిమాండ్ తో అటు టీడీపీ ఎంపీలతో పాటు ఇటు వైసీపీ ఎంపీలు కూడా లోక్ సభలో నిరసనకు దిగారు. తాజాగా నేటి ఉదయం కూడా ఇరు పార్టీల ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబట్టి ఆందోళనకు దిగారు. టీడీపీ ఎంపీల కంటే కాస్త ముందుగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న వైసీపీ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి ప్రత్యేక హోదా కోసం నినదించారు. ఈ నిరసనలో వైసీపీకి చెందిన ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఎంపీల నినాదాల అనంతరం తొలుత వైవీ సుబ్బారెడ్డి, ఆ తర్వాత వైఎస్ అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగానే అక్కడికి టీడీపీ ఎంపీలు చేరుకున్నారు. లోక్ సభలో టీడీపీ పక్ష నేత తోట త్రిమూర్తులు నేతృత్వంలో టీజీ వెంకటేశ్, అవంతి శ్రీనివాస్, సీఎం రమేశ్, మురళీమోహన్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, సీతారామలక్ష్మి, శివప్రసాద్, పండుల రవీంద్ర బాబు తదితరులు ఆందోళనకు దిగారు.