: పవన్ కల్యాణ్ పార్టీ మాకు తెలియదే!... 'ఆప్' సౌతిండియా చీఫ్ సోమ్ నాథ్ భారతి కామెంట్!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో టాలీవుడ్ అగ్ర నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ ‘జనసేన’పై పెద్ద చర్చే జరిగింది. గడచిన ఎన్నికలకు ముందే పురుడుపోసుకున్న ఈ పార్టీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగలేదు. అయితే టీడీపీకి మద్దతుగా నిలిచింది. ఫలితంగా ప్రదాని నరేంద్ర మోదీ వద్ద పవన్ కల్యాణ్ కు సాదర స్వాగతం లభించింది. వెరసి జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు దాదాపుగా తెలిసిన వారుగా మారారు. అయితే ఢిల్లీలో అధికార పీఠం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మాత్రం పవన్ కల్యాణ్ ఎవరో, ఆయన స్థాపించిన పార్టీ ఏమిటో తెలియవట. ఈ మేరకు నిన్న తిరుపతి వచ్చిన ఆ పార్టీ సౌతిండియా చీఫ్ సోమ్ నాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు ఉంటుందా? అన్న తిరుపతి జర్నలిస్టులకు సోమ్ నాథ్ దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. 'అసలు పవన్ కల్యాణ్ పార్టీ ఏమిటి? అలాంటి పార్టీ ఉన్నట్లు మాకు తెలియదే!' అని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్ సౌతిండియా చీఫ్ గా ఉన్న మీకు పవన్ కల్యాణ్ పార్టీ గురించి తెలియకపోవడమేమిటన్న మీడియా ప్రశ్నకు సోమ్ నాథ్ నుంచి సమాధానం రాలేదు.