: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. నేడు వారణాసిలో సోనియా గాంధీ రోడ్ షో
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలవడం ద్వారా దేశంలో నానాటికీ పడిపోతున్న తమ గ్రాఫ్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ప్రకటించింది. అఖిలేష్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ఇక నేడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ ‘షో’లో యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్, సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్, శ్రీప్రకాశ్ జైశ్వాల్, ప్రమోద్ తివారి, రీటా బహుగుణ జోషి, జాఫర్ అలీ, సంజయ్ సింగ్, రాణా గోస్వామి, రాజేశ్ మిశ్రా, అజయ్ రాయ్, రాజేశ్‌పటి తృప్తి తదితరులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కచ్చహరిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రోడ్ షో ప్రారంభం కానుంది. ఎనిమిది కిలోమీటర్ల మేర మూడు గంటల పాటు ‘షో’ జరగనుంది.