: ‘హోదా’ బదులు ఎన్ని కోట్లిచ్చినా ప్రయోజనం ఉండదన్న సుజనా!... సంతోషపెడతామన్న జైట్లీ!


మిత్రపక్షం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిరసన గళం విప్పడంతో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఎట్టకేలకు మేల్కొంది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని తేల్చేసిన కేంద్రం... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, పార్లమెంటు లోపలా, బయటా టీడీపీ ఎంపీల నిరసనలతో ఉలిక్కిపడింది. కాస్త ఆలస్యంగానైనా ఆ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక హోదాపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో దాని స్థానంలో భారీగా ‘ప్రత్యేక సహాయం’ చేయాలని కేంద్రం తలపోస్తోంది. అయితే ఈ ప్యాకేజీ ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా ఉండేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా, మిత్రపక్షం టీడీపీలో వెల్లువెత్తుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీతో వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లిన వెంకయ్యనాయుడు... టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కూడా వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాను మాత్రమే తమ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని, దాని స్థానంలో ఎన్ని కోట్లిచ్చినా వారిని సంతోషపెట్టలేరని ఆయన నేరుగా జైట్లీకి చెప్పినట్లు సమాచారం. ఈ సమయంలో కలగజేసుకున్న అరుణ్ జైట్లీ... ఏపీ ప్రజలను తమ ప్యాకేజీతో తప్పనిసరిగా సంతోషపెడతామని, అందుకు ఒకటి, రెండు రోజులు మాత్రమే ఆగాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక సాయంగా పెద్ద ప్యాకేజీనే ప్రకటించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News