: మోదీకి ఓటు వేయాలన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రధానిని ప్రశ్నించాలి: సీపీఐ నేత రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీకి ఓటు వేయాలంటూ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని, ఇప్పుడు మోదీని ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ ప్రశ్నించాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయారని చంద్రబాబు నాయుడిని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలిపిన పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు ప్రధానితో సమావేశం కావాలని ఆయన సూచించారు. వెంకయ్య నాయుడు హోదాపై పోరాడకుండా కేంద్రమంత్రి పదవి కోసమే ప్రాకులాడుతున్నారని ఆయన విమర్శించారు.