: మద్యం మత్తులో లేడీస్ హాస్టల్ వద్ద ఏపీ మంత్రి తనయుడి వీరంగం!
అసలే కోతి... ఆపై కల్లు తాగింది .. అన్న చందంగా ఏపీ కేబినెట్ లో కీలక శాఖ మంత్రిగా ఉన్న ఓ టీడీపీ నేత సుపుత్రుడు నిన్న గుంటూరులో నానా బీభత్సం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఒళ్లు తెలియనంత మత్తులో మునిగిన మంత్రిగారి తనయుడు గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్ వద్ద నానా రభస చేశాడు. ఆ మత్తులో అతడు ఏకంగా లేడీస్ హాస్టల్ లోకి చొరబడేందుకు యత్నించాడు. అయితే మంత్రి గారి కుమారుడి అరుపులు, కేకలతో అక్కడికి సమీపంలో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్ కు చెందిన యువకులు అక్కడికి చేరుకుని మంత్రి కుమారుడిని అడ్డుకునే యత్నం చేశారట. అయినా వినని మంత్రిగారి పుత్రుడు లేడీస్ హాస్టల్ లోకి చొరబడేందుకే యత్నించాడట. దీంతో లాభం లేదని భావించిన ఆ యువకులు నేరుగా పోలీసులకు సమాచారం అందించారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... మంత్రిగారి పుత్రుడిని చూసి చేసేదేమీ లేక మందలించి ఇంటికి పంపారట. అయినా అక్కడ నానా రభస చేసిన సదరు మంత్రిగారి పుత్రుడి పేరుగాని, మంత్రిగారి పేరుగాని బహిర్గతం కాలేదు.