: ‘హోదా’పై చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదు: బొత్స
రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం ప్రవర్తించొద్దని అన్నారు. హోదా రాకపోతే ఆ అంశం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. హోదాపై ఇంతగా ఆందోళనలు జరుగుతోన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదని బొత్స ఆరోపించారు. రేపు జరిగే రాష్ట్ర బంద్‌లో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కి మద్దతిచ్చాయని బొత్స పేర్కొన్నారు. ‘బంద్ అంటే ఎవరి మీదకో దండయాత్ర కాదు.. మన భవిష్యత్తు కోసమే బంద్ లో పాల్గొందాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. హోదా సాధించుకోవడంలో తాము వెనకడుగు వేయబోమని, ప్రత్యేక హోదా రావాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు.