: లోక్ సభలోనూ టీడీపీ ఎంపీల నినాదాల హోరు!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రత్యక్ష ఆందోళనలకు తెర తీసిన టీడీపీ పార్లమెంటు వెలుపలా, లోపలా నినాదాలతో హోరెత్తిస్తోంది. నేటి సమావేశాల కోసం పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీలు తొలుత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబట్టి నిరసనకు దిగారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన లోక్ సభలోకి ప్రవేశించిన ఎంపీలు అక్కడ కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి తీరాలంటూ టీడీపీ ఎంపీలు చేస్తున్న నినాదాలతో లోక్ సభ దద్దరిల్లుతోంది. ఓ వైపు ప్రశ్నోత్తరాలు మొదలైనా, టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నినాదాలతో మొదలుపెట్టి సీట్లలో నుంచి లేచిన టీడీపీ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.