: ఓ మై గాడ్... కాశ్మీర్ ర్యాలీలో లష్కరే టాప్ ఉగ్రవాది అబూ దుజానా!
కాశ్మీరు లోయలో జరుగుతున్న అల్లర్ల వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల హస్తం ఉందనడానికి మరో నిదర్శనమిది. లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన ఉగ్రవాదుల్లో ఒకడైన అబూ దుజానా, ఆదివారం కాశ్మీర్ లో జరిగిన నిరసన ప్రదర్శనకు ప్రత్యక్షంగా హజరైనట్టు తెలుస్తోంది. ఎంతో మంది యువత అతని చుట్టూ చేరి నినాదాలు చేస్తున్న చిత్రాలు, వీడియో దృశ్యాలు కనిపిస్తున్నాయి. గులాబీ రంగు షర్ట్ వేసుకుని, పొడవాటి వెంట్రుకలతో, ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి చుట్టూ ఎంతో మంది యువకులు ఉండగా, అతనే దుజానాగా భావిస్తున్నారు. దీనిపై పోలీసుల నుంచి అధికారిక స్పందన మాత్రం వెలువడలేదు. దుజానా రాకతో అల్లర్లు మరింతగా పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పోలీసులు, భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరుల తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.