: నవ్యాంధ్ర ‘వాణిజ్యం’లో సత్తా చాటిన చంద్రబాబు జిల్లా!
వాణిజ్యపన్నుల ఆదాయంలో నవ్యాంధ్రప్రదేశ్ సత్తా చాటింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ రాష్ట్రం సొంతంగా ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో చేసిన యత్నం సత్ఫలితాలనిచ్చింది. వెరసి దండిగా నిధులు సమకూరడంతో పాటు దేశంలోనే ఆదాయ వృద్ధిలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మేర అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ వృద్ధిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా... చిత్తూరు జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లలోకెల్లా వాణిజ్యపన్నుల ఆదాయ వృద్ధిలో చిత్తూరు జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికంలో రాష్ట్రం మొత్తం మీద వాణిజ్యపన్నుల ఆదాయంలో 14.64 శాతం వృద్ధి నమోదు కాగా... చిత్తూరు డివిజన్ మాత్రం 37.63 శాతం వృద్ధిని నమోదు చేసింది. వెరసి అన్ని డివిజన్లు, అన్ని జిల్లాల కంటే చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక 28.97 శాతం వృద్ధితో కరవు జిల్లా అనంతపురం జిల్లా రెండో స్థానంలో నిలవగా, -7.98 శాతం తిరోగమన వృద్ధితో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్ చివరి స్థానంలో నిలిచింది. ఆదాయం పరిమాణం పరంగా చూస్తే... రాష్ట్రం మొత్తం మీద తొలి త్రైమాసికంలో రూ.3,921 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.1,331 కోట్ల ఆదాయం ఆర్జించిన విజయవాడ-2 డివిజన్ ఈ విషయంలో అగ్రస్థానంలో నిలవగా, రూ.494 కోట్లతో విశాఖ డివిజన్ రెండో స్థానంలో నిలిచింది.