: ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్!... భాగ్యనగరి పేదలకు తెలంగాణ సర్కారు బంపరాఫర్!
కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైవిధ్యంతో కూడిన సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు వర్గాలకు మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్ సర్కారు... నేడు మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి వరకు మాత్రమే వర్తించే ఈ పథకంలో కేవలం ఒక్క రూపాయికే నల్లా (మంచినీటి) కనెక్షన్ లభించనుంది. నగరంలోని పేదలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గడచిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భాగ్యనగరి ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘సింగిల్ రూపాయికే నల్లా కనెక్షన్’ పథకాన్ని ప్రభుత్వం ప్రజలకు గిఫ్ట్ గా అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.