: మోదీ కళ్లకు గంతలు కట్టి, ముఖం నిండా గాయాలతో షారూఖ్ ఫొటో పెట్టి!... ఏపీ పోలీస్ కు షాకిచ్చిన హ్యాకర్లు!


అందివచ్చిన సాంకేతిక పరిఙ్ఞానం వినియోగంలో అందరికంటే మెరుగ్గా రాణిస్తున్నామని చెప్పుకుంటున్న నవ్యాంధ్ర పోలీసులకు షాక్ తగిలింది. సైబర్ నేరగాళ్లు ఏకంగా ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ)లోకే చొరబడ్డారు. అంతేకాకుండా ‘మీ వెబ్ సైట్ ను హ్యాక్ చేశాం. దయ చేసి మీ రంధ్రాలు మూసుకోండి’ అంటూ హ్యాకర్లు ఆ వెబ్ సైట్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో నెల్లూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్ సైట్ లోకి కూడా హ్యాకర్లు చొరబడ్డారు. సదరు వెబ్ సైట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో అప్ లోడ్ చేసి ఆ ఫొటోలో మోదీ కళ్లకు గంతలు కట్టారు. మోదీ చర్యలను భరించలేమంటూ డాక్టర్ సయ్యద్ ఖాన్ దే అనే పేరుతో హెచ్చరికలు కూడా పోస్ట్ చేశారు. ఆ పక్కనే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఫొటోనూ పెట్టారు. ముఖం నిండా గాయాలతో ఉన్నట్లు షారూఖ్ ఖాన్ ఫొటో కనిపిస్తోంది. షారూఖ్ ఫొటో కింద జునైద్ నజీర్ పేరుతో హెచ్చరికలతో కూడిన కామెంట్లను కూడా హ్యాకర్లు పోస్ట్ చేశారు. హ్యాకర్ల వ్యవహారంపై రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ ను వివరణ కోరగా... ఎస్ఎల్పీఆర్బీ సైట్ హ్యాకింగ్ కు గురైన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. కామెంట్ పెట్టిన హ్యాకర్లు సైట్ లోని ఏ ఒక్క అంశాన్ని తొలగించలేదని, ఎడిటింగ్ కూడా చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ హ్యాకింగ్ కు ‘ఇన్ సేనిటి సెక్యూరిటీ హ్యాకర్స్ ఇంటర్నేషనల్’ కంపెనీకి చెందిన సుసుకే అనే వ్యక్తి కారణమని కూడా గుర్తించామని అతుల్ సింగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News