: అసలెందుకు విభజించారు?: చంద్రబాబు సూటి ప్రశ్న
సుభిక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలెందుకు విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న మాట వాస్తవమని, నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అని అన్నారు. ఈ ఉదయం ఎంపీలు, మంత్రులతో సమావేశమై ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ తరువాత పార్టీ ఎలా అడుగులు వేయాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చించారు. ఆపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రేపు మంత్రులు, ఎంపీలతో కూడిన ప్రజా ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నామని తెలిపారు. రాష్ట్రంలో వనరులు లేవని అనుకున్నప్పుడు విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని బీజేపీని ప్రశ్నించిన చంద్రబాబు, రేపు రాష్ట్ర అవసరాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. నాడు విభజనకు అన్ని పార్టీలూ అంగీకరించాయని, మెజారిటీ పార్టీలన్నీ హోదా, విభజన చట్టానికి అనుకూలమేనన్న సంకేతాలను పార్లమెంటు సాక్షిగా ఇచ్చాయని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేసిన చంద్రబాబు, ప్రజల సెంటిమెంటుతో ఆడుకోవద్దని హితవు పలికారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం తమకు, రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కానేకాదని స్పష్టంగా చెప్పిన చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు తెలుపుతామని అన్నారు. విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు కలిసికట్టుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు మరచిపోయేలా చేయాల్సి వుందని, అందుకు ప్రత్యేక హోదాతో పాటు అదనపు నిధులను, పన్ను రాయితీలనూ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని తాను మొదటి నుంచీ వాదిస్తున్నానని, ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హోదా హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. పార్లమెంటులో జరిగిన పరిణామాలన్నింటినీ, నేడు క్షుణ్ణంగా పరిశీలించామని, తెలుగుదేశం ఎంపీలు సైతం హోదా కోసం పట్టుబట్టారని తెలిపారు. నాడు అంగీకరించి, ప్రజలకు హామీలిచ్చి, నేడు అర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం ఉందన్న విషయం నాడు గుర్తుకు రాలేదా? అని అడిగిన చంద్రబాబు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడబోమని తెలిపారు.