: పూర్తిగా నిండిన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల... కృష్ణమ్మ పరుగును ఒడిసిపడుతున్న శ్రీశైలం
గడచిన మూడు వారాల వ్యవధిలో కర్ణాటక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టితో పాటు నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఈ మూడు జలాశయాల్లోకి వస్తున్న నీటిని వస్తున్నట్టే అధికారులు వదిలేస్తుండగా, ఆ నీరంతా శ్రీశైలం రిజర్వాయరుకు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం అల్మట్టికి 15,420 క్యూసెక్కల నీరు వస్తుండగా, దాన్ని యథాతథంగా కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ కు 15,448 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 15,300 క్యూసెక్కులను దిగువకు పంపుతున్నారు. ఇక తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం 1,612.8 అడుగులకు చేరుకుంది. ఈ జలాశయానికి 7,480 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7,290 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. సుంకేసుల జలాశయానికి 2,220 క్యూసెక్కల నీరు ప్రవహిస్తుండగా, ఔట్ ఫ్లో 2,012 క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయానికి 38 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 24 వేల క్యూసెక్కులను శ్రీశైలం రిజర్వాయర్ కు వదులుతున్నారు. వివిధ ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి 40 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, పుష్కర అవసరాల నిమిత్తం 22,248 క్యూసెక్కుల నీటిని సాగర్ డ్యామ్ కు వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాడు 808 అడుగుల వరకూ ఉన్న శ్రీశైలం జలాశయ నీటిమట్టం మరో 10 అడుగులకు పైగా పెరిగి 818.5 అడుగులకు చేరింది. కాగా, శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులన్న సంగతి తెలిసిందే.